ఉదయించే కిరణాలకి తెలుసా ప్రేమించే అమ్మ,
వికసించే కుసుమాలకి తెలుసా లాలించే అమ్మ,
పయనించే కెరటాలకి తెలుసా కరుణించే అమ్మ,
కనిపించని దైవనికి తెలుసా దీవించే అమ్మ,
లోకంలో మనిషికి దొరికిన అదృష్టమేగా అమ్మ,
మనుషుల్లో అమ్మై ప్రేమించే అమ్మాయేగా అమ్మ,
నవ మాసాలు మోసి,ఒక రూపాన్నే చేసి,కడుపున నిను కాపాడి జన్మనిచ్చే అమ్మ,
నడి రాత్రుల్లో లేచి,తన నిదురంతా విడిచి,నీ ఆకలి గుర్తించి పాలిచ్చే అమ్మ,
నవ్వే చిన్నారిని చూసి, ఎంతటి భాదైన మరచి,
తుళ్ళే ఆ తొందర చూసి, అనుక్షణమూ తను గమనించి,
నిను ఓదార్చి,ఒడిలో చేర్చి,ఎనలేని ప్రేమను నిత్యం పంచే కరుణామయి అమ్మ,
లాలిపాటే ఆలపించి లాలించే అమ్మ,
లాలపోసి బుజ్జగించి ముద్దాడే అమ్మ,
మాటరాని పాప పలికే తొలి మాటే అమ్మ,
లోటు లేని ప్రేమనిచ్చి ఏమి ఆశించదే అమ్మ,
తొలి అడుగే నేర్పించి,తడబడినా నడిపించి, నీ పరుగే తను చూసి ఆనందించే అమ్మ,
కథలెన్నో చెప్పి,తొలి గురువై చదివించి,అందరిలో నీ గెలుపే కోరేదే అమ్మ,
గగనాన జాబిలిని చూపి,దిగిరమ్మంటూ కబురంపి,
కమ్మగా బువ్వను కలిపి,వద్దన్నా కడుపే నింపి,
తన శోకాన్ని,తన కష్టాన్ని,కనిపించక దాచేసి నిను పోషించే అమ్మ,
ఆకలైన ఆపదైన జగమంతా పలికేదే అమ్మ,
తొలి మాటైన చివరి పలుకైన కాదా అమ్మ,
నువ్వు లేని లోకముంటే ప్రేమంటే తెలిసేనా అమ్మ,
నిన్ను మించి దీవెనలిచ్చే దైవం ఉందా అమ్మ,
అనురాగం నిత్యం అందిచే ఇల దైవం అమ్మ,
మమకారం మొత్తం చుపించే దయ నీదే అమ్మ,
భువి లోన తీయని పలుకంటే అది కాదా అమ్మ,
ప్రతి క్షణమూ నీ సుఖమే కోరేదే అమ్మ,
గత జన్మలో పుణ్యమే నను నేడు పుట్టించిందమ్మ,
మరు జన్మంటూ ఉంటే అది నీకే అంకితమే అమ్మ,
No comments:
Post a Comment